ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ నానోటెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు మౌనిక.

ఆమె స్వస్థలం పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామం. ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్న రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్.మౌనిక(27). పదో తరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనికకు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్-7లో ఉంటూ.. ఎంటెక్ నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది.
ప్రతీ రోజు ఆమె తొందరగా ఆ రూం నుంచి బయటకు వచ్చేది.. కానీ ఆ రోజు రాలేదు. ఎంత పిలిచినా పలకలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు కిటికీలోంచి చూడగా.. ఉరేసుకొని కనిపించింది. కంగారు పడిన తోటి విద్యార్థులు కాలేజీ యామాన్యానికి సమాచారం అందించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇలా రాసి ఉంది.. ‘ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ’ అని ఉంది. దీంతో పోలీసులు ఆమె శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.































