ఆన్ లైన్ గేమ్ ల కారణంగా పిల్లలు వాటికి అలవాటు పడి చదువులకు దూరం అవుతున్నారు. భవిష్యత్తును చక్కగా తీర్చుదిద్దుకోవాల్సిన వయస్సులో ఇలాంటి ఆటలు ఆడుతూ అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా అందులో డబ్బులను పెట్టి.. నష్టాలను మూటకట్టుకోవడంతో పాటు తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో 16 ఏళ్ల కుర్రాడు, అతడి తల్లిదండ్రులతో నివసిస్తున్నారు.

అతడికి గేమ్ లు అంటే అస్సలు తెలవదు. కానీ అతడికి ఎలా తెలిసిందో ఏమో గానీ.. గత నెలలో అతడు పబ్‌జీ ఆడటం మొదలు పెట్టాడు. ఈ గేమ్ బాగుందనుకొని తన తల్లి అకౌంట్ నుంచి దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టేశాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియడంతో ఇంట్లో ఓ లెటర్ పెట్టి పారిపోయాడు.
అందులో ఏముందంటే.. ఇంటి నుంచి తాను పారిపోతున్నట్లు రాశాడు. అతడి కోసం వెతికినా తల్లిదండ్రులు లాభం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అతడు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన ఫోన్ ను కూడా తీసుకెళ్లాడు.
ఫోన్ స్విచ్ఛాప్ చేసిన అతడు దగ్గర్లోని మహాకాళీ గుహల దగ్గర దాక్కున్నాడు. చీకటి పడటంతో అతడు ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే పోలీసులు ఆ ఫోన్ ను ట్రాకింగ్ చేయగా.. అతడి అడ్రస్ కనుక్కొని అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. అతడిని.. తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.































