Muthyala Muggu : ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో ఓ పౌరాణిక చిత్రం తీయాలని బాపు-రమణలు అనుకున్నారు. అలాంటి సినిమాకి భారీ బడ్జెట్ అవసరమవుతుందని నూజివీడు జమీందారులను సంప్రదించారు. హఠాత్తుగా అక్కినేనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కొరకు అమెరికా వెళ్లిపోయారు. అలా జరగడంతో ప్రారంభంలోనే చిత్రం ఆగిపోయింది. నూజివీడు నిర్మాతలు ఈ లోపు ఒక చిన్న సినిమా తీసుకోమని బాపు-రమణలకు సలహా ఇచ్చారు.అలా మొదలైన చిత్రమే ముత్యాలముగ్గు.

అప్పుడే మద్రాసులో హీరోయిన్ గా సినిమా అన్వేషణ కొనసాగిస్తున్న సంగీతను బాపు-రమణలు తాము తీయబోయే కొత్త చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. నటుడిగా పెద్దగా గుర్తింపులేని శ్రీధర్ ని ఈ సినిమాకి హీరోగా ఎంపిక చేసుకున్నారు. అలా సినిమా పనులు జరుగుతున్న సమయంలో… స్టార్ వేల్యూ లేదు పైగా సినిమాలో ఒక్కరికి కూడా మేకప్ లేదు ఇక సినిమా ఆడినట్టేనని సినీ ప్రముఖులు పెదవి విరిచారు.

“ముత్యాలముగ్గు” 1975లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు – అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి.రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి.

ఈ చిత్రం మొదటి షెడ్యూల్ 1975 జనవరి 17న హైదరాబాదులోని సారథి స్టూడియోలో తీయాలనుకున్నారు కానీ అక్కడ షూటింగులతో బిజీగా ఉండడంతో హైదరాబాదులో “రాక్ క్యాస్టిల్” హోటల్ లో విలన్ హౌస్ కు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు… ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు – కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు.

వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు. కె వి మహదేవన్ సంగీత సారధ్యంలో వచ్చిన పాటలలో
“ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా”.. అనే పాట మినహాయించి మిగతావన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి.

సెగట్రీ..!! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో !!…. సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిగినెస్సేనా.. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది? సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు… ఇలాంటి సంభాషణలు రావుగోపాల్ రావు తూర్పు గోదావరి యాసలో చెప్పడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నిజంగా ఈ సినిమా రావు గోపాల్ రావు భవిష్యత్తు సినిమాలపై ఎంతో ప్రభావాన్ని చూపింది.

ఆయన నటించిన సినిమాల్లో.. “ముత్యాలముగ్గు” రావు గోపాలరావు సినీ గమనాన్ని మార్చిందనడంలో సందేహం లేదు…. అయితే నూజివీడు జమీందారి నిర్మాతలు ఈ సినిమా మధ్యలోనే వెనుదిరగడంతో వెంకటరమణ సంభాషణలతో పాటు ఈ సినిమాకి ఫైనాన్స్ కూడా చేయడం జరిగింది. అలా 12 లక్షలతో నిర్మించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడంతో దాదాపు రెండు కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆనాటి విజయవంతమైన చిత్రాలలో ముత్యాలముగ్గు కూడా ఒక చిత్రంగా నిలిచింది.


































