మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ఎన్నికలను పోస్టల్ బ్యాలెట్ ద్వారా మంచు విష్ణు కుట్రకు తెరదీశారంటూ ప్రకాశ్ రాజ్ అనడంతో.. విష్ణు ప్యానల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. విష్ణుకు మద్ధతుగా నరేశ్ మాట్లాడుతూ.. జయసుధ పోటీ చేసిన సమయంలో మాత్రమే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ వాడామని.. అంతకముందు ఇలాంటివి లేవని.. అతడు చెప్పాడు.

దీనిపై వివిధ రకాలుగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దీనిపై విష్ణు మనోవేధనకు గురైనట్లు పుర్కొన్నాడు. అగ్రదేశాలు కూడా పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడిన మాటలు అస్సలు బాగాలేదని అన్నారు. ప్రకాశ్ రాజ్ జీ ఛానెల్, అశోక్ తివారీలకు బాకీ పడ్డారని.. దాదాపు అతడిపై ఏడున్నర కోట్ల చెక్ బౌన్స్ కేసు ఉందని.. అతడు గుర్తు చేశారు. అంతకముందు.. దీనిపైనే ప్రకాశ్ రాజ్ మంచు ప్యానల్ పై శ్రీకాంత్, జీవితా రాజశేఖర్ తో కలిసి వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

ఓట్లు కోసం అడ్డదారులు తొక్కడానికి విష్ణు, మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎన్నికల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని మండిపడ్డారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడతారని ప్రశ్నించారు.
ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారన్నారు. గెలవడం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగున్న విషయం తెలిసిందే.




























