కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించడం అనేది అతడికే కాకుండా అందరికీ మంచిదే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నామని చెబుతున్నా అది ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉండాలని అధికారులు చెబుతుంటారు.

కానీ కొందరి పోలీసుల తీరు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంటుంది. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని కట్టే అధికారం ఎవరికీ ఉండదు. అతడు చేసింది నిజంగా తప్పు అయితే చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి.. కానీ ఒకరిపై చెయ్యి చేసుకునే హక్కు ఎవరికీ ఉండదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎస్‌ఐ చేసిన నిర్వాకం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.
అసలేం జరిగిందంటే.. నెల్లూరు జిల్లా చేజర్ల ఎస్‌ఐ మహ్మద్ హనీఫ్.. అందూరుపల్లి సెంటర్‌లో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ ఆటో డ్రైవర్ మూతికి మాస్క్ ధరించకుండా వెళ్తోన్న వ్యక్తి ఎస్ ఐ చూశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన హనీఫ్.. సదరు వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని కాలితో తన్నాడు.
అంతే కాకుడా.. చొక్కా పట్టుకొని తన్నుతూ కారులోకి తీసుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం స్థానికుడు తన మొబైల్ లో చిత్రీకరించాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయ్యింది. మాస్క్ ధరించనంత మాత్రాన ఇంతలా దండించాలా.. అయినా దీనిపై పోలీస్ అధికారి స్పందించిన తీరు బాగాలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




























