టమాటా మన వంటింట్లో తప్పనిసరిగా ఉండే కూరగాయ. కానీ ఇది కేవలం వంటల రుచికే కాదు, చర్మ సంరక్షణలో కూడా మంచి ఫలితాలు ఇస్తుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో లభించే ఖరీదైన క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్‌పై ఆధారపడకుండా సహజంగా చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలనుకునే వారికి టమాటా మంచి ఎంపికగా మారుతోంది.

టమాటాలో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన మురికి, అదనపు జిడ్డును తొలగించడంలో సహాయపడతాయి. రోజూ కొద్దిసేపు టమాటా రసాన్ని ముఖానికి రాయడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో తిరిగే వారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.
మొటిమలు, నల్లటి మచ్చల సమస్యతో బాధపడేవారికి కూడా టమాటా ఉపయోగకరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ ఆమ్ల గుణాలు చర్మ రంధ్రాలను శుభ్రపరచి మొటిమలు తగ్గేలా సహాయపడతాయి. చర్మంపై మృతకణాలను తొలగించి ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది.
ఎండ ప్రభావంతో వచ్చే సన్ ట్యాన్ తగ్గించడంలో కూడా టమాటా ఉపయోగపడుతుంది. టమాటాలోని లైకోపీన్ చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది సహజ టోనర్‌లా పనిచేస్తుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.
చర్మం బిగుతుగా ఉండేందుకు కూడా టమాటా సహాయపడుతుందని చెబుతున్నారు. టమాటా ముక్కపై కొద్దిగా తేనె లేదా చక్కెర వేసి ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం తాజాగా కనిపించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించుకుని తర్వాత ఉపయోగించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



























