Ambati Rambabu :మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోందని, ఎవరిని అరెస్టు చేసినా కనీసం రెండు నెలల పాటు బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసును ఉదాహరణగా తీసుకుని ఆయన మాట్లాడుతూ, “ఇది చాలా విచిత్రమైన కేసు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేయలేదట. మళ్లీ జనవరిలో మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న కాకాణిని కసబ్ను, టెర్రరిస్టును తీసుకు వచ్చినట్లుగా తీసుకొచ్చారు” అని మండిపడ్డారు. కాకాణి కారు చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారని, డీఎస్పీ కోర్టులోకి అడ్వకేట్లను కూడా వెళ్లనివ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి నిర్బంధాలకు పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణమని ఆయన అన్నారు. రాజకీయ కక్షతోనే సోమిరెడ్డి కేసు పెట్టించారని, కాకాణిని ఇబ్బంది పెట్టాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఆయన విమర్శించారు.
కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడంపై కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్గా ఉన్న కొమ్మినేని వారించలేదని కేసు పెట్టారని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైనదని ఆయన దుయ్యబట్టారు.
“డెడ్ బాడీ దొరికితే 307 కేసులు కూడా పెడతారు. అధికారం ఉంటే తప్పుడు కేసులు పెడతారా? పోలీసులు కూడా ఏ సెక్షన్లు కావాలంటే ఆ సెక్షన్లు పెడుతున్నారు. పైన ఖాకీ చొక్కా, లోపల పచ్చ చొక్కా వేసుకునేవారికే పోస్టింగులు ఇస్తున్నారు” అని అంబటి రాంబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు, కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.






























