మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మనం పసుపు లేదా పచ్చి అరటిపండ్లను మాత్రమే ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఇటీవలి కాలంలో ఎర్ర అరటిపండ్లు కూడా ఆరోగ్య ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రుచి, పోషక విలువల పరంగా ఇవి ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో విస్తృతంగా పండించే ఎర్ర అరటిపండ్లు ఇప్పుడు భారతదేశంలో కూడా లభ్యమవుతున్నాయి. క్రమంగా మార్కెట్లలో వీటి అందుబాటు పెరుగుతుండటంతో వినియోగం కూడా పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పండ్లు సాధారణ అరటిపండ్లతో పోలిస్తే మరింత పోషక విలువలు కలిగి ఉంటాయి.
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఆంథోసయనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను రక్షించి, వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా తీసుకుంటే చూపు మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.
ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అదేవిధంగా, జీర్ణక్రియను సులభతరం చేసి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఇంకా ముఖ్యంగా, ఎర్ర అరటిపండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని పోషకాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో సహాయపడతాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఎర్ర అరటిపండ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.































