Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకొని ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారారు. నిన్న ఈయన ఉపముఖ్యమంత్రిగాను అలాగే మంత్రిగాను బాధ్యతలు తీసుకొని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమై అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇక ఈయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో లేదో ఆయనకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఒంటరి మహిళల డేటా కలెక్ట్ చేసి వారి సమాచారాన్ని సంఘ విద్రోహులకు అందించడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 32,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని ఈ విషయంపై ప్రభుత్వం మౌనంగా ఉంది అంటూ అప్పట్లో ప్రశ్నించారు.
ఇక ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నెలలకే జగన్ ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. గతంలో వాలంటీర్ల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తీసుకువచ్చారు. వాలంటీర్ల ద్వారా 32,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని పవన్ తెలిపారు. అయితే ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. ఆ 32,000 మందిని తీసుకువచ్చి వారి కుటుంబాలకు అప్పచెప్పాలి అంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అధికారం మీదే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా వీరి చేతిలోనే ఉంది కనుక వీరి అధికారాన్ని ఉపయోగించి కనిపించకుండా పోయిన 32,000 మంది మహిళలను తీసుకురావాలంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా గతంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈయనకే సవాల్ గా మారాయని తెలుస్తుంది. మరి ఈ విషయంపై పవన్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.





























