దేశంలో ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎట్టకేలకు కేంద్రం నుంచి ఒక శుభవార్త వెలువడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, డాక్టర్ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 25 కోట్ల మంది జనాభాకు 2021 జులై నాటికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసి తీరతామని పేర్కొన్నారు. 40 కోట్ల నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను ఇందుకోసం సిద్ధం చేసుకుంటామని చెప్పారు.

 

దేశంలో అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రాధాన్యతా వివరాలను పంపించాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశామని.. ఈ నెల చివరినాటికి అందుకు సంబంధించిన వివరాలు అందుతాయని వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే వ్యాక్సిన్ సేకరణకు సంబంధించిన ప్రయత్నాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి దేశంలో వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంస్థలకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందుతున్నాయని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వైద్యులకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. వైద్యులు కరోనా మహమ్మారిపై ముందు నిలిచి పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లోని చాలా సంస్థలు ప్రస్తుతం చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కోవాషీల్డ్ వ్యాక్సిన్ సక్సెస్ అయితే పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది.

టీకా ఉత్పత్తి, పంపిణీలో సవాళ్లు ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొనాలంటే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొని రావాల్సిందే. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here