మామూలుగా మనం ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పోలీసుల కోసం ధరించడం కాకుండా మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ధరించాలి. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు ఏమాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు.ఈ విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి పోలీసులు జరిమానా విధించడం మనం చూస్తుంటాము. ప్రజలకు జరిమానా విధించిన పోలీసులు సైతం కొన్నిసార్లు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. మరి వారికి జరిమానా విధించరా.. అంటూ సామాన్యులు ఎన్నోమార్లు ప్రశ్నించారు.

తాజాగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్నటువంటి పోలీసులకు కూడా గట్టి దెబ్బ తగిలింది. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 27 మంది పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది.జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రధాన కూడళ్ల వద్ద, పోలీస్ క్వార్టర్స్ దగ్గర భారీ ఎత్తున మోహరించారు.
ఈ క్రమంలోనే హెల్మెట్లు లేకుండా బయటకు వచ్చిన 27 మంది పోలీసులకు అక్కడే జరిమానా విధించి డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా ఒక్కరోజులోనే 27 మంది పోలీసులకు జరిమానా విధించిన ట్రాఫిక్ డీఎస్పీని.. ఎస్పీ అభినందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం తప్పుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. కేవలం హెల్మెట్ ధరించని 27 మంది పోలీసులు మాత్రమే కాకుండా, హెల్మెట్ ధరించనీ సాధారణ ప్రయాణికులకు వంద మందికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించినట్లు తెలిపారు.