పిల్లల్లో చాలామంది బలపాలు, చాక్ పీస్ లు తింటూ ఉంటారు. తల్లిదండ్రులు వాటిని తినకూడదని సూచించినా కొందరు పిల్లలు వాటిని తింటూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతో పాటు గర్భవతులైన మహిళలు, కొందరు పురుషులు కూడా బలపాలు, చాక్ పీస్ లను తింటూ ఉంటారు. అయితే రెండేళ్ల లోపు పిల్లలు బలపాలు, చాక్ పీస్ లు తింటే వారికి అవగాహన ఉండదు కాబట్టి ఆ సమస్యను తీవ్రంగా పరిగణించకూడదు.

అలా కాకుండా వయస్సు పెరుగుతున్నా వాటిని తింటూ ఉంటే మాత్రం పీకా అనే ఒక సమస్య ఉన్నట్టు భావించాలి. ఈ సమస్య బారిన పడి ఉంటే వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే మంచిది. ఎక్కువగా బలపాలు, చాక్ పీస్ లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. బలపాలు, చాక్ పీస్ లను చూడగానే నోరూరుతుందంటే ఈటింగ్ డిసార్డర్ గా పరిగణించాలి. శరీరంలో తగినంత జింక్ లేని వారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.

బలపాలు, చాక్ పీస్ లు విష పదార్థాలు కాకపోయినా ఎక్కువగా తినడం వల్ల నష్టాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినేవారిలో దంతాలు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఉండటంతో పాటు మలబద్ధకం సమస్య కూడా వేధించే అవకాశం ఉంటుంది. కడుపులో నులిపురుగులు పెరగడం, ఆకలి తగ్గిపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా బలపాలు, చాక్ పీస్ లు తినేవాళ్లను వేధిస్తాయి.

బలపాలు, చాక్ పీస్ లు, మట్టి తినేవారికి బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్ చేసి ఫలితాల ఆధారంగా చికిత్స అందిస్తారు. కొన్నిసార్లు మందులతో పాటు వైద్యులు థెరపీ కూడా చేస్తారు. తినకూడని పదార్థాలు తినాలని అనిపిస్తే అది కూడా ఆరోగ్య సమస్యగానే భావించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here