ఎప్పుడూ వివాదాలతోనే కాపురం చేసే ఆర్జీవీ.. ఆయన ఏం చేసినా చేయకపోయినా కాంట్రవర్సీ అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మళ్లీ సోషల్ మీడియాలో మరో వివాదంలో చిక్కుకున్నాడు. తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ కథ ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న చిత్రం కొండా.

ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా వంచనగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన కొండా దంపతులతో కలిసి గ్రామదేవతలకు పూజలు చేశారు. నిజానికి దేవుళ్లంటే వర్మకు నమ్మకం లేదు. కానీ సినిమా ఓపెనింగ్ రోజు నిర్మాతలు చేసే పూజలకు మాత్రం సహకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జీవీ.. అమ్మవారికి విస్కీ తాపించాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. “నాకు వొడ్కా మాత్రమే తాగటం అలవాటున్నప్పటికీ.. గండిమైసమ్మకు మాత్రం విస్కీ తాగించాను. చీర్స్..” అంటూ తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. దీనిపై నెటిజన్లు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుళ్లపై నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ కించపరచవద్దని కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. బయోపిక్ లు తీయడంలో వర్మకు సాటి ఎవరూ ఉండరు. కొండా చిత్రాన్ని తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మురళి – సురేఖల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న వర్మ చెప్పాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేశారు. ప్రస్తుతం వరంగల్ నగరంలో హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ లో 1980ల నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఈ చిత్రంలో వర్మ చూపించబోతున్నట్లు సమాచారం.


























