Senior Journalist Imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇక ఆయన గొప్పతనం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ ఆయన స్వయంగా చూసిన కృష్ణ గారి గొప్ప మనసు గురించి చెప్పారు.

కృష్ణ వద్దకు వచ్చి ఏడ్చిన ఆ హీరో…
కృష్ణ గారు డబ్బు సంపాదించడం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఆయన తన సినిమాలు హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా సినిమాలను తీసేవారు. ఇక నిర్మాతలను ఆదుకోవడంలో ముందుండే కృష్ణ గారు ఆయన సహాయ నటులకు కూడా అంతే సహాయం చేసారంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అభిప్రాయపడ్డారు. కృష్ణ గారు విలన్ గా నటించిన చిత్రం కే.విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రైవేటు మాస్టర్’. ఈ సినిమాలో హీరోగా రామ్మోహన్ గారు చేసారు. రామ్మోహన్ గారు కృష్ణ గారు ఇద్దరూ ఒకేసారి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే కృష్ణ గారు అనతి కాలంలోనే మంచి హీరోగా ఎదిగారు. కానీ రామ్మోహన్ గారు కెరీర్ ను సరిగా నిర్మించుకోలేక పోయారు. అలా ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కృష్ణ గారి వద్దకు వచ్చి ఏమీ చెప్పకుండా కళ్ళనిండా నీళ్లు పెట్టుకోగా కృష్ణ గారు అర్థం చేసుకుని ఇరవై ఐదు వేలు చెక్కును ఇచ్చారు.

అలాగే ఆ డబ్బు ఊరికే ఇచ్చినట్టు కాకుండా ‘పండంటి కాపురం’ సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చారు అందుకు పారితోషకంగా ఆ ఇరవై ఐదు వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని రామ్మోహన్ గారు చాలా సార్లు చెప్పి కృష్ణ గారి గొప్పతనం చెప్పేవారట. ఇక ఆయన సహ నటులకు కూడా ఎంతో సహాయం చేసేవారంటూ ఇమందిగారు చెప్పారు. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్తులుగా ఉన్నవాళ్లు ఎవరైనా వేషాలు లేక ఇబ్బందులు పడుతుంటే వారికి ఇతర సినిమాల్లో వేషాలు ఇప్పించేనందుకు ఆ సినిమా యూనిట్ తో మాట్లాడి ఐదువేలు, ఆరు వేలు రెమ్యూనరేషన్ ఇప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ కృష్ణ గారి గొప్పతనాన్ని ఇమంది గారు పంచుకున్నారు.

































