తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు పెద్ద దుమారాన్ని రేపుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహం పరిశీలించిన అధికారులు కొన్ని అంశాలపై స్పష్టత కోరుతున్నారు. ఫ్యాన్‌కు ఉరేసుకున్నప్పటికీ, ఆమె కాళ్లు బెడ్‌కు తగిలే స్థితిలో ఉండడం, ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి.

ఈ నేపథ్యంలో స్వేచ్ఛ తండ్రి చేసిన ఆరోపణలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చేశాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, స్వేచ్ఛ పూర్ణచందర్ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు మొదటి భర్త కిరణ్‌తో పెళ్లి అయి విడాకులు వచ్చిన తర్వాత, పూర్ణచందర్‌తో కలిసి జీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ జంట ఇటీవలే అరుణాచల యాత్రనూ పూర్తి చేసి వచ్చింది.
తన కూతురి ఆత్మహత్యకు పూర్ణచందర్‌నే పూర్తి బాధ్యత వహించాలని స్వేచ్ఛ తండ్రి ఘాటు ఆరోపణలు చేశారు. “నా కూతురు పూర్ణచందర్‌తో ఉన్న జీవితంలో చాలాసార్లు బాధ పడింది. ఆయన ఇతర మహిళలతోనూ సంబంధాలు పెట్టుకుని ఆమెను మానసికంగా హింసించేవాడు. ఆ విషయం నేను స్వేచ్ఛకు చెప్పినా వినలేదు. కానీ ఇటీవల మాత్రం ఆమె తనను విడిచిపెడతానని చెప్పింది” అంటూ తండ్రి వెల్లడించారు.
తనతో చివరిసారిగా శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడిన స్వేచ్ఛ, “పూర్ణచందర్‌తో ఇక ఉండలేను. విడిపోతున్నాను” అని తెలిపిందట. కానీ అదే రోజు రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా పూర్ణచందర్‌కు కూడా వివాహమై పిల్లలున్నారని, అయినప్పటికీ స్వేచ్ఛను మానసికంగా మూడు సంవత్సరాలుగా హింసిస్తున్నాడని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్వేచ్ఛ మృతిపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందంటూ పలువురు మహిళా సంఘాలు, న్యాయవాదులు స్పందిస్తున్నారు. నిజమేంటో తెలుసుకునే వరకు ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు కొనసాగే అవకాశముంది.






























