మృతదేహాన్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన గ్రామస్తులు.. ఎందుకంటే..!

0
313

ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో కొట్టుకుపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి మృతదేహాన్ని గ్రామస్తుల సహాయంతో పోలీసులు వెలికి తీయించారు. కానీ ఆ గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఆ మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి 30 నిమిషాల పాటు అటూ.. ఇటూ ఊపారు. గ్రామస్తులు ఇలా చేస్తుండగా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటనను పోలీసులు కూడా వీడియోలు, ఫొటోలు తీయడం విశేషం.

ఈ ఘటనలో గ్రామస్తులు ఎందుకు అలా చేశారు.. చివరకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో కుంభ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగీపురా గ్రామానికి చెందిన భన్వర్ లాల్ అనే వ్యక్తి నదిలో స్నానం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలు చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.

అప్పటికే అతడు మృతిచెందాడు. అయితే గ్రామస్తులు ఆ మృతదేహాన్ని తీసుకొని చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. దీనికి కారణం ఏంటంటే.. ఇలా చేస్తే నీరు బయటకు వచ్చి బతుకుతాడనే నమ్మకం ఉందంటూ.. గ్రామస్తులు తెలిపారు. అందుకే పోలీసులు కూడా ఏమనలేక వదిలేశారు. ఇలా దాదాపు 30 నిమిషాల పాటు చేశారు.

అయినా ఉపయోగం లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసు ఉన్నతాధికారులు వరకు ఈ విషయం వెళ్లింది. దీంతో అక్కడ కోవిడ్ నిబంధనలు పాటించని వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ సిద్దమైంది.