భద్రాచలం క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్నీ రేపు (అనగా గురువారం) నిరాడంబరంగా నిర్వచడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం భద్రాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో ఉన్న బేడా మండపంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు శ్రీ సీతారామచంద్రులకు సమర్పించనున్నారు.

ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, ఆలయ ఈవో నర్సింహులు కలిసి మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తరువాత కల్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. అయితే కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో భక్తులు లేకుండానే పూజారులు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని టీవిలో ప్రసారం చేయనున్నారు.






























