ఎవరికైనా పెళ్లి సంబంధం చూడాలంటే సాధారణంగా పంతులను అడిగి.. అమ్మాయి లేదా అబ్బాయి కోసం వెతకమని చెబుతాం. లేదంటే పేపర్లో ప్రకటనలు ఇస్తుంటాం. ఇది కాకపోతే మ్యాట్రిమోనీ సైట్ లలో వెతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వెరైటీగా ఆలోచించాడు. అందరిలా కాకుండా తనకు వధువు కావాలంటూ.. తన షాప్ కు బోర్డును తగిలించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని 33 ఏళ్ల ఉన్ని కృష్ణన్ త్రిచూర్ లో ఉంటున్నాడు. అతడు తన పెళ్లి కోసం వెతకని ప్రదేశం లేదు.. అడగని మనిషి లేడు. కానీ అతడికి ఎక్కడా సంబంధం కుదరలేదు. దీంతో అతడు చేసేది లేక.. తన టీ స్టాల్ ముందు వధువు కావలెను అంటూ బోర్డ్ పెట్టాడు. కులం, మతం లాంటికి పట్టింపులు లేవంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేశాడు.
దానిపై తన ఫోన్ నంబర్ కూడా పెట్టాడు. ఇలా అతడు తనకు తాను ఆ ఊళ్లోనే పబ్లిష్ చేస్తుండగా.. ఓ రోజు తన స్నేహితుడు ఆ బోర్డును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెట్టింట్లో ఉన్నికృష్ణన్ బోర్డు తెగ వైరల్ అయ్యింది. ఇక చూసుకో.. అతడికి ఫోన్ల మీదు ఫోన్లు వచ్చి పడుతున్నాయి. మన దేశం నుంచే కాకుండా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. కేరళ మహిళలు కూడా చాలా మంది కాల్స్ చేసినట్లు సమాచారం.
దీనిపై కొంతమంది అతడిని ప్రశ్నించగా.. ఇటీవల అతడికి తలలో చిన్న కణితి ఏర్పడగా.. ఆపరేషన్ చేశారని చెప్పాడు. దాని నుంచి పూర్తిగా రికవరీ అయినట్లు అతడు చెప్పాడు. తనకు ఓ లాటరీ తగలడంతో టీ స్టాల్ పెట్టుకున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. దీని కంటే ముందు పెళ్లి ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.






























