దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు కరోనా భయంతో వింత చేష్టలు వికృత చేష్టలు చేయడం మొదలుపెట్టారు. కరోనా బారిన పడకుండా ఉండాలని వారికి తోచినట్లు వారు ప్రవర్తించడంతో అసలు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును తిన్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని మధురై జిల్లా, పెరుమపట్టికి చెందిన వడివేలు అని 50 సంవత్సరాల వ్యవసాయ కూలి ఒకరోజు మద్యం మత్తులో ఉండి కరోనాకు విరుగుడు అంటూ ఒక చచ్చిన పామును చేతిలో పట్టుకుని చిందులేశారు. ఆ పామును తినడం వల్ల తనకు కరోనా రాదు అంటూ అందరూ చూస్తుండగానే చచ్చిన కట్లపాము నమిలి తినేసాడు.
అందరూ చూస్తుండగానే వడివేలు పాముని తిన్నగా కొందరు ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన జిల్లా అటవీ శాఖ అధికారులు సైబర్ పోలీసులను ఆశ్రయించి చివరకు వడివేలును గుర్తించి అతనిని అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ కట్లపాములో ఎంతో విషపూరితమైన న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, వీటి వల్ల మనుషులలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వడివేలు టైం బాగుండి అతను విషపు గ్రంధిని కొరకలేదని అటవీశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ తనతో మద్యం తాగించి కొందరు వ్యక్తులు కావాలనే ఈ విధంగా చేయించారని తెలిపారు.ఈ క్రమంలోనే పోలీసులు అతనిని అరెస్టు చేయడంతో పాటు తను చేసిన ఈ పనికి ఏడు వేల రూపాయలు జరిమానా విధించారు.






























