Pitapuram: పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి వర్మ జనసేన పార్టీ విజయానికి ఎంతగానో దోహదం చేశారు. నిజానికి ఈ నియోజకవర్గంలో ఎంతో పలుకుబడి ఉన్నటువంటి ఈయనకే ఈసారి టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ అనుకోకుండా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ టికెట్ పొందారు.

ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వస్తే తనకు కీలక పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు బుజ్జగించడంతో తప్పనిసరి పరిస్థితులలో వర్మ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ విజయానికి కారణమయ్యారు.
ఇలా పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణం అయినటువంటి వర్మపై జనసేన నాయకులు, హత్య ప్రయత్నం చేయడం పెద్ద సంచలనంగా మారింది. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో వర్మపై దాడికి పాల్పడ్డారు జనసైనికులు. ఈ గ్రామంలో సర్పంచ్ ను కలవడానికి వర్మ వెళ్లడంతో తమ గ్రామంలోకి వర్మ రావడానికి వీలు లేదంటూ జనసేన నాయకులు దాడి చేశారు.
ప్లాన్ ప్రకారమే దాడి…
ఈ దాడిలో భాగంగా ఆయన కారు ధ్వంసం కావడమే కాకుండా స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ దాడి పై వర్మ స్పందించారు.ప్లాన్ ప్రకారం చేసిన హత్యాయత్నమే అని అన్నారు. తనను చంపే ఉద్దేశంతోనే జనసేన కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. 20ఏళ్ళ తన రాజకీయ జీవితంలో పిఠాపురంలో ఇలాంటి దాడి జరగటం మొదటిసారని అన్నారు వర్మ. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసినందుకు సరైన ఫలితమే ఇచ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు





























