రేపు యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉదయం 11.30 కు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీంటిని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.ఇటీవలే త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ కలిశారు.

ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీమణి శోభ, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన ఆయన… యాదాద్రి నూతన ఆలయం ప్రారంభంపై చర్చించారు. ఆ తేదీలు, ముహూర్తం, వివరాలను యాదాద్రి వేదికగా సీఎం కేసీఆర్ రేపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పునర్నిర్మాణ పనులు అన్నీ పూర్తయ్యాయి. నవంబరు లేదా డిసెంబరు తొలి వారంలో పంచ నారసింహుల ఆలయ ఉద్ఘాటన చేపట్టనున్న నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న కట్టడాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.
దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు కానున్న రక్షణ గోడకు జైపూర్ ఐరావతం, స్వామి రథశాల కళాకృతులను భక్తులు సందర్శించేలా పోర్టీకో, మెట్ల దారి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో అక్కడ ఉన్న బండరాళ్లను తొలగిస్తున్నారు. క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికుల కొండపైకి వెళ్లే ఆలయ పాత కనుమదారిని విస్తరించే పనులు చేపడుతున్నారు.
గతంలో హరిత అతిథి గృహ సముదాయం నుంచి కొండపైకి, ప్రస్తుతం జీయర్ కుటీరం వద్ద గల మలుపు నుంచి దారి విస్తరించే పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఆ దారిలోని మినీ పార్కునూ తొలగిస్తున్నారు. దీనికి ప్రదాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ప్రధానితో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ వేడుకలో హాజరు కానున్నారు.


























