అరటిపండు తినేసి తొక్కను చెత్తబుట్టలో వేసేయడం మనందరికీ అలవాటే. కానీ అదే అరటి తొక్క చర్మ సంరక్షణలో అద్భుతంగా ఉపయోగపడుతుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ కంటే ఇంట్లోనే సహజంగా లభించే అరటి తొక్కతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చర్మం పొడిబారడం, ట్యాన్, మొటిమలు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి హోమ్ కేర్ టిప్‌గా మారుతోంది.

అరటి తొక్కలో విటమిన్ A, B, C, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందించి సహజ కాంతిని పెంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు అరటి తొక్కను ముఖంపై మెల్లగా రుద్దితే చర్మం తాజాగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖంపై కనిపించే ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో కూడా అరటి తొక్క ఉపయోగపడుతుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వయసు పెరిగేకొద్దీ చర్మం బిగుతు కోల్పోతుంది. అలాంటి సమయంలో అరటి తొక్కతో మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారి యంగ్ లుక్ ఇవ్వడంలో కొంత వరకు సహాయపడుతుందని చెబుతున్నారు.
మొటిమలు, మొటిమల మచ్చలతో ఇబ్బంది పడేవారికి కూడా ఇది సహజ పరిష్కారంగా ఉపయోగపడొచ్చు. అరటి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై పేరుకునే మలినాలను తగ్గించడంలో దోహదపడతాయి. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు వారంలో కొన్ని సార్లు దీన్ని ఉపయోగిస్తే చర్మం తాజాగా కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో ఎండ తీవ్రత కారణంగా చర్మంపై మంట, ఎర్రబడటం, దురద వంటి సమస్యలు రావడం సాధారణం. అలాంటి సమయంలో చల్లటి అరటి తొక్కను ముఖంపై మెల్లగా రుద్దితే చర్మానికి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఇది స్కిన్‌ను కూల్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
అలాగే ట్యాన్ సమస్యను తగ్గించి ముఖానికి సహజమైన గ్లో తీసుకురావడంలో కూడా అరటి తొక్క ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇందులోని సహజ గుణాలు డెడ్ స్కిన్ తొలగించడంలో దోహదపడతాయని, దీంతో ముఖం మరింత కాంతివంతంగా కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అరటి తొక్కను ఉపయోగించే విధానం కూడా చాలా సులభమే. తాజా అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖంపై వృత్తాకారంలో 5 నుంచి 10 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయాలి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరి చర్మ తత్వం వేర్వేరుగా ఉండటంతో ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.

























