ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం ఎంత కీలకమో, ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియలో లోపం ఉంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందకుండా ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యలను తగ్గించడానికి వంటింట్లోనే సులభంగా లభించే పదార్థాలతో కొన్ని చిట్కాలు పాటించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

భోజనానికి ముందు అల్లం ముక్కపై చిటికెడు ఉప్పు చల్లి తినడం ఒక పాతకాలపు అలవాటు. దీనివల్ల లాలాజలం స్రావం పెరిగి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు చురుకుగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కడుపు భారంగా అనిపించడం, అజీర్ణ సమస్యలు తగ్గడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
ఇంకా పుదీనా చట్నీలో ఉసిరికాయ కలిపి తీసుకోవడం కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ కలయికలో ఉన్న పోషకాలు కొవ్వు పదార్థాల జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అదనంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ఉపయుక్తమని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.
జీలకర్ర, సోంపుతో తయారుచేసిన నీరు కూడా జీర్ణవ్యవస్థకు ఉపయోగకరమైనది. ఈ రెండు పదార్థాలను నీటిలో మరిగించి తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం లేదా భోజనం తర్వాత ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా కొనసాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే ఈ చిట్కాలను పాటించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపు సంబంధిత సమస్యలు, ముఖ్యంగా అల్సర్లు ఉన్నవారు ఈ విధానాలను అనుసరించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే రక్తాన్ని పల్చబరిచే మందులు వాడుతున్న వారు అల్లం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. గర్భిణీలు కూడా అల్లాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇలాంటి సహజ చిట్కాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడినా, మితిమీరిన వినియోగం సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమతుల్యంగా, జాగ్రత్తగా ఈ విధానాలను అనుసరించడం అవసరం. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.




























