పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఇప్పటివరకు ఎక్కువగా జీర్ణవ్యవస్థ కోణంలోనే చర్చించేవారు. అయితే తాజా పరిశోధనలు ఈ సూక్ష్మజీవులు కేవలం జీర్ణక్రియకే పరిమితం కాకుండా, మన శరీర బలం, కండరాల పనితీరుపైనా కీలక పాత్ర పోషిస్తున్నాయని సూచిస్తున్నాయి. ఫిట్‌నెస్ అంటే ప్రోటీన్ తీసుకోవడం, వ్యాయామం చేయడం మాత్రమే అనుకునే వారికి ఈ అంశం కొత్త కోణాన్ని చూపుతోంది.

ఇటీవల వెలువడిన ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం పేగుల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన మంచి బ్యాక్టీరియా కండరాల శక్తిని నేరుగా ప్రభావితం చేయగలవని తేలింది. దీనిని నిపుణులు “గట్-మసిల్ యాక్సిస్”గా అభివర్ణిస్తున్నారు. అంటే పేగుల ఆరోగ్యం, కండరాల పనితీరు మధ్య పరస్పర సంబంధం ఉందని అర్థం. పేగుల్లో సూక్ష్మజీవుల సమతుల్యత బాగుంటే, కండరాలు కూడా సమర్థంగా పనిచేస్తాయని ఈ పరిశోధన చెబుతోంది.
ఈ అధ్యయనంలో ప్రత్యేకంగా ‘రోసిబ్యూరియా ఇనులినివోరాన్స్’ అనే బ్యాక్టీరియాపై దృష్టి సారించారు. ఈ బ్యాక్టీరియా శరీరంలో శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వృద్ధుల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నవారికి చేతి పట్టుదల (హ్యాండ్‌గ్రిప్) శక్తి గణనీయంగా మెరుగ్గా ఉండటం గమనించారు. అలాగే యువతలో కూడా ఈ సూక్ష్మజీవులు అధికంగా ఉన్నప్పుడు స్టామినా, శారీరక సామర్థ్యం మెరుగుపడినట్లు కనిపించింది.
జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఈ బ్యాక్టీరియా ఉన్న గ్రూప్‌లో కండరాల బలం స్పష్టంగా పెరిగినట్లు గుర్తించారు. మనుషుల్లో కూడా జిమ్‌లో చేసే లెగ్ ప్రెస్, బెంచ్ ప్రెస్ వంటి వ్యాయామాల్లో మంచి ఫలితాలు రావడానికి గట్ ఆరోగ్యం కీలకంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ మంచి బ్యాక్టీరియా శరీరంలో అమినో ఆమ్లాల వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కండర కణాలు అవసరమైన శక్తిని త్వరగా పొందగలుగుతాయి. సాధారణంగా చెప్పాలంటే, ఇది కండరాలకు ఇంధనం అందించే విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చుతుంది. అందువల్ల వ్యాయామం తక్కువ చేసినా కూడా కొందరు సహజంగా బలంగా కనిపించడానికి గట్ మైక్రోబయోమ్ పాత్ర ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పేగుల ఆరోగ్యం మెరుగుపడితే మొత్తం శరీర పనితీరు మెరుగవుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చడం అవసరం. ఇవి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా గట్‌లో సూక్ష్మజీవుల వైవిధ్యం పెరుగుతుంది. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఈ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది.
మొత్తంగా చూస్తే, కండరాల పెరుగుదల అనేది కేవలం ప్రోటీన్ తీసుకోవడం లేదా జిమ్‌లో గంటలు గడపడం వల్ల మాత్రమే సాధ్యమయ్యే విషయం కాదు. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యమని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిట్‌నెస్ కోసం ప్రయత్నించే వారు గట్ హెల్త్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.






























