వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం సహజమే. బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులతో బాధపడే చాలామంది రోజూ పలు రకాల మందులు వాడుతున్నారు. అయితే ఒకేసారి అధిక సంఖ్యలో మందులు తీసుకోవడం ఇప్పుడు కొత్త ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఒకేసారి ఐదు లేదా అంతకంటే ఎక్కువ రకాల మందులు వాడటాన్ని వైద్య భాషలో “పాలీఫార్మసీ”గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుండగా, వృద్ధుల్లో దీని ప్రభావం మరింత తీవ్రమవుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పలు రకాల వ్యాధులకు వేర్వేరు మందులు వాడటం వల్ల శరీరంలో అనుకోని రసాయనిక ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధుల్లో పెద్ద సంఖ్యలో మందుల దుష్ప్రభావాల ముప్పు ఉన్నట్లు గుర్తించారు. చాలామంది రోజుకు ఏడు నుంచి పది రకాల మందులు వాడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఎక్కువ మందులు వాడే కొద్దీ వాటి మధ్య పరస్పర ప్రభావం పెరిగి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని మందులను కలిపి వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు వాడే రక్తం పలుచబడే మందులు కలిసి తీసుకుంటే రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. అలాగే షుగర్ రోగులు ఇన్సులిన్‌తో పాటు కొన్ని బీపీ మందులు వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయినా గుర్తించలేని పరిస్థితి రావచ్చని చెబుతున్నారు. మరికొన్ని మందులు రక్తంలో పొటాషియం స్థాయిలను పెంచి గుండె పనితీరుపై ప్రభావం చూపే అవకాశమూ ఉందని సూచిస్తున్నారు.
మందుల దుష్ప్రభావాల వల్ల కళ్లు తిరగడం, తీవ్రమైన అలసట, జీర్ణక్రియలో ఇబ్బందులు, నడుస్తూ తూలిపడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు ఒక మందు వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్‌ను మరో కొత్త వ్యాధిగా భావించి అదనంగా మరిన్ని మందులు వాడే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక భారం కూడా పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల సూచన లేకుండా స్వయంగా మందులు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా మందులు రాయించుకునే ముందు ఇప్పటికే వాడుతున్న మందుల వివరాలు, పాత ప్రిస్క్రిప్షన్లు డాక్టర్‌కు చూపించడం చాలా అవసరమని సూచిస్తున్నారు. అవసరం లేని మందులను తగ్గించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు.
ఇక అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ఔషధాల ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతోంది. అందుకే అవసరమైన మందులను మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.



























