వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో తీవ్ర విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు సంఘటనల్లో రెండు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలలో ఒకటి సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలుతో ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
అలాగే మరో ఘటనలో, సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహంలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి (ఓ ఆటోమొబైల్ షాప్ నిర్వాహకుడు) తీవ్ర తోపులాటలో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ రెండు ఘటనలతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న నేపథ్యంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లో తడబాటు ఉండటం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



































