సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అతడి అల్లుడు నారాచంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో సినీ నటులకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడో ఒక సందర్భంలో సెలబ్రిటీలు అటువైపు అడుగులు వేయకుండా ఉండలేరు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రెటీలు కూడా ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి వెళ్లక తప్పదు.

ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు దేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ముఖ్యమైన పట్టణాల్లో అతడు పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. ఆ సమయంలోనే ఖమ్మం జిల్లా దగ్గర రోడ్డు యాక్సిడెంట్ కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ప్రచారం కోసమే వాడుకోవడం అభిమానులకు నచ్చలేదు. ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణలో టీడీపీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అయితే టీడీపీ మొత్తం కనుమరుగైపోయిందనే చెప్పాలి.

ఇలాంటి కష్ట సమయంలో పార్టీని ఆదుకునే నాయకుడు కావాలని ఓ వర్గం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్కరే ఇప్పుడు పార్టీని కాపాడగలడనే ఆశాభావం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ లో చాలా మంది అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో ఇప్పుడే వెళ్లే పరిస్థితి లేదని ఓ ఇంటర్వ్యూలో కూడా అన్నాడు.

పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పలేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లోకి అతడి మార్కెట్ వెళ్తోంది. ఇటువంటి సమయంలో అటు వైపు ఆలోచించడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాడట. ఒకవేళ టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేస్తే మాత్రం పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని అతడి అభిమానులు అంటున్నారు.

































