పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి, తన కుమారుడు సూర్యకి సంబంధించిన వివాదంపై తాజాగా స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే…

విజయ్ సేతుపతి తనయుడు సూర్య, జూలై 4న విడుదలైన ‘ఫీనిక్స్’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి స్పందన అందుకున్న సూర్య నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, సినిమా ప్రీమియర్‌కు సంబంధించిన కొన్ని వీడియోలపై తీవ్ర వివాదం చెలరేగింది.
సూర్య ప్రీమియర్‌లో తీసిన వీడియోలను డిలీట్ చేయాలని మీడియాపై ఒత్తిడి తెచ్చారు అంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ వివాదంపై స్పందించిన విజయ్ సేతుపతి. “నిజంగా అలాంటి ఒత్తిడి తీసుకువచ్చి ఉంటే, అది తెలియక జరిగి ఉండవచ్చు లేదా ఇతరుల ద్వారా జరిగి ఉండొచ్చు. కానీ ఎవరికైనా బాధ కలిగితే, నా తరఫున క్షమాపణలు చెబుతున్నా” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై విజయ్ స్పందించడంతో అభిమానులు ఆయన వినయాన్ని, బాధ్యతాయుతమైన వైఖరిని ప్రశంసిస్తున్నారు. ఫీనిక్స్ సినిమాలో సూర్యతో పాటు దేవదర్శిని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సినిమా దర్శకుడు అనల్ అరసు కాగా, ఈ చిత్రం ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది.































