సాధారణంగా ఖాకీడ్రెస్ లో ఉన్న పోలీసులను చూస్తే ప్రజలు భయంతో హడలిపోతుంటారు. వారు ప్రజల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తారనే భావన ప్రజలలో లోతుగా నాటుకుపోయింది. కరోనా కష్టకాలంలో పోలీసుల మంచితనం బయట పడటం వల్ల అందరిలో పోలీసులపై ఉన్న భావనను కరోనా చేరిపిందని చెప్పవచ్చు. వారిలో కఠినత్వం మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉందని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తాజాగా ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మర్రెపాలెం గ్రామానికి రెండు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఓ అనాధ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్సై వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, సురేష్ లను ఈ సంఘటన స్థలానికి పంపించారు. అయితే ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎవరు సాయంగా లేకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ సురేష్ స్వయంగా ఆ శవాన్ని అటవీ ప్రాంతం నుంచి రెండు కిలో మీటర్ల దూరం వరకు మోసుకొచ్చారు.
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ఆ శవాన్ని తీసుకు రావడానికి భయంతో ప్రజలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ ఆటో డ్రైవర్ సహాయంతో కానిస్టేబుల్ సురేష్ ఒక కర్రకు మృతదేహాన్ని కట్టి భుజాలపై రెండు కిలోమీటర్ల దూరం వరకు మోసుకొచ్చారు. అనంతరం ఆ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఒక అనాధ శవం పట్ల హెడ్ కానిస్టేబుల్ సురేష్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ శవాన్ని ఆస్పత్రికి తరలించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం ఎంతోమంది నెటిజన్లు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



























