కాదిర్ దర్శకత్వంలో 1996 లో అబ్బాస్, వినీత్, టబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ప్రేమదేశం”. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అద్భుతం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉన్నటువంటి “ముస్తఫా.. ముస్తఫా”అనే పాట అప్పట్లో ప్రతి ఒక్క ప్రేక్షకుడు నోటిలో మెదిలేది. అంతలా ఈ పాట ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. అయితే ఈ పాట చిత్రీకరణ జరిగే సమయంలో ఓ పెద్ద గొడవ జరిగిందని, ఆ గొడవ కారణంగా ఏకంగా రౌడీలు కత్తులు పట్టుకొని చిత్ర బృందం పై దాడికి దిగారని ఈ చిత్రంలో నటించినటువంటి హీరోలలో ఒకరైన వినీత్ తెలియజేశారు. ఆలీతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినీత్ అప్పట్లో ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఈ సంఘటనను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

ఈ సందర్భంగా అలీ ముస్తఫా సాంగ్ షూటింగ్ సమయంలో పెద్ద గొడవ జరిగిందటగా ..అని వినీత్ ను ప్రశ్నించగా.. అందుకు వినీత సమాధానం చెబుతూ ఈ సినిమాలో ముస్తఫా పాట షూటింగ్లో భాగంగా మెరీనా బీచ్ లో చేశారు. అయితే అదే సమయంలో కాలేజీలో ఫేర్వెల్ జరుగుతుండగా ఎంతోమంది డాన్సర్స్ కూడా అక్కడ ఉన్నారు. మెరీనా బీచ్ లో చిత్ర బృందం అందరూ ఉండగా బీచ్ లో స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి చిన్నపిల్లలు అక్కడకు వేరుశనగ పల్లీలు అమ్ముతూ వచ్చారు.

అయితే ఈ పిల్లలపై డాన్సర్ ఒక అమ్మాయి వారిని విసుక్కోవడంతో వెంటనే అక్కడ ఉండేటటువంటి వారు పెద్ద పెద్ద కత్తులు, కుర్చీలు తీసుకొని ఎవరది ఇక్కడ పిల్లలను అలా అన్నది. వాళ్ళు ఎవరో మాకు తెలియాలి అంటూ పెద్ద గొడవ చేశారు. అయితే చిత్రబృందం మొత్తం అక్కడే ఉన్నాము. ఎవరికి ఏం సర్ది చెప్పాలో తెలియలేదనీ వినీత్ తెలిపారు.
ఈ విధంగా పిల్లల పై దురుసుగా ప్రవర్తించినటువంటి ఆ అమ్మాయిని అక్కడినుంచి ఎలాగలాగో పంపించేశాను. అయితే ఆ అమ్మాయిని వెనుక నుంచి మేనేజర్ కారులో అక్కడినుంచి తీసుకెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చే వారితో మాట్లాడి ఈ గొడవ సద్దుమణిగేలా చేశారు. లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ గొడవకు బలయ్యే వారని ఈ సందర్భంగా వినీత్ ఆలీతో అప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.



































