Viral Kohli : టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క దంపతులకు వామికా అనే పాప ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాప ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. విరుష్క జంట ఇప్పటి వరకు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. వామికాను ప్రపంచానికి కనిపించకుండా అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారు కోహ్లీ.
కాగా దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లి గారాల పట్టి వామికా కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. కోహ్లి సతీమణి అనుష్క శర్మ చేతుల్లో కేరింతలు కొడుతున్న చిన్నారి స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎట్టకేలకు వామిక పాపను చూశామంటూ కొందరు సంబరపడిపోగా…. బ్రాడ్‌కాస్టర్ ఇలా చేయడమేమిటని మరికొందరు మండిపడ్డారు.
విరుష్క కోరినట్లుగా వామిక విషయంలో గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాల్సిందని ఇలా చేయడం సరికాదని ట్రోల్ చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఫొటోలను డిలీట్ చేయగా… కొన్ని వార్తా సంస్థలు సైతం తమ ఆర్టికల్స్‌లో వామిక ఫొటో కనబడకుండా జాగ్రత్తపడ్డాయి. ఇక ఈ విషయంపై విరాట్ కోహ్లి తాజాగా స్పందించాడు. వామిక ఫొటోలు బయటకు వచ్చిన విషయం తమకు తెలియదని… ఏదేమైనా వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.
అలా చేయకపోతే మిమ్మల్ని అభినందిస్తున్నాం అంటూ…
ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ‘‘నిన్న మైదానంలో మా కుమార్తె ఫొటోలు తీసిన విషయం తెలిసింది. నిజానికి కెమెరా ఫోకస్ మా మీద ఉందని తెలియదు. ఒకవేళ వామిక ఫొటోలు షేర్ చేయనట్లయితే మీ అందరికీ కృతజ్ఞతలు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం’’ అని అనుష్కతో కలిసి కోహ్లి ప్రకటన విడుదల చేశాడు. కాగా మూడో వన్డేలో కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా… ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.



























