హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజును కాలాష్టమిగా పిలుస్తారు. ముఖ్యంగా భైరవ స్వామికి అంకితమైన ఈ తిథిని శైవ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. మే నెలలో వచ్చే కాలాష్టమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.

పురాణాల ప్రకారం భైరవ స్వామి అనేది పరమశివుడి ఉగ్రరూపంగా భావిస్తారు. దుష్టశక్తులను తొలగించి భక్తులను రక్షించే దేవుడిగా భైరవుడిని ఆరాధిస్తారు. అందుకే కాలాష్టమి రోజున భైరవ స్వామిని పూజిస్తే భయాలు, అడ్డంకులు, దోషాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ రోజున భక్తులు ఉదయం స్నానం చేసి ఉపవాసం ప్రారంభిస్తారు. ఆలయ దర్శనం చేసి నువ్వుల నూనె దీపం వెలిగించడం, నల్ల నువ్వులు సమర్పించడం, భైరవ అష్టకం లేదా శివ మంత్రాలను జపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొంతమంది రాత్రి జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు.
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలాష్టమి రోజున భైరవ స్వామిని ఆరాధించడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా శని, రాహు, కేతు ప్రభావాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు.
అలాగే ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం కూడా శుభప్రదంగా భావిస్తారు. భైరవ స్వామికి కుక్క వాహనంగా ఉండటంతో ఈ ఆచారం కొనసాగుతోందని పురాణ కథనాలు చెబుతున్నాయి.
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కాలాష్టమి రోజున భక్తితో చేసే పూజలు సానుకూల శక్తిని పెంచుతాయని చెబుతారు. అయితే ప్రాంతానుసారం పూజా విధానాలు మారుతూ ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు.
Disclaimer: పై సమాచారం మత విశ్వాసాలు, పురాణాలు మరియు పండితుల అభిప్రాయాల ఆధారంగా అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు.



























