ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, నాడు నేడు మొదలైన స్కీమ్ ల ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది.
ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా ప్రైవేట్ రంగంలోని ఖాళీలను సైతం భర్తీ చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా జగన్ సర్కార్ నిరుద్యోగులకు అవసరమైన ఉపాధి శిక్షణను కూడా కల్పిస్తోంది. మంత్రి గౌతమ్‌రెడ్డి విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ వలస కేంద్రం(ఐఎంసీ) ఏర్పాటు చేయనున్నట్టు కీలక ప్రకటన చేశారు.
మంత్రి గౌతమ్ రెడ్డి ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ బోర్డ్ సమావేశానికి హాజరై ఈ విషయాలను వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ ఐఎంసీ ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునే ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇస్తామని ఐటీఐల్లో, నైపుణ్య కేంద్రాల్లో, జిల్లా ఉద్యోగ కల్పన కేంద్రాల్లో ఐఎంసీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందుతుందని అన్నారు.
జర్మనీ, గల్ఫ్, యూరప్ దేశాలలో ఓంక్యాప్ ద్వారా 3,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఈ కేంద్రాల సహాయసహకారాలతో కెరీర్ కౌన్సెలింగ్, విదేశాలకు వెళ్లడానికి అవసరమైన శిక్షణను అందిస్తామని తెలిపారు.