సునీల్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా తెరంగేట్రం చేసి మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు చేసి మళ్లీ కమెడియన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు సునీల్. అయితే.. చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు. కానీ.. సునీల్ కు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగారు. స్కూల్, కాలేజీ ఎగ్గొట్టి భీమవరంలో రోజూ సినిమాలు చూడటమే సునీల్ పని. మెగాస్టార్ చిరంజీవిలా డ్యాన్స్ వేయాలనుకోవడం, ఆయనలా ఉండాలనుకోవడం, ఆయనలా డ్రెస్సులు వేసుకోవాలనుకోవడం.. ఇలా సునీల్ కు చిన్నతనంలోనే సినిమా అంటే ఒకరకమైన అభిమానం ఏర్పడింది.

అయితే.. సునీల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నది నిజమే కానీ.. కమెడియన్ అవుదామని మాత్రం రాలేదట. తన ఫేస్ విలన్ కి అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి.. విలన్ అవుదామని హైదరాబాద్ కు వచ్చారట. కానీ.. ఆయనకు ఎక్కువగా కమెడియన్ పాత్రలు రావడంతో కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సునీల్. మెగాస్టార్ చిరంజీవి తర్వాత.. మోహన్ బాబు పండించే విలనిజం అంటే సునీల్ కు చాలా ఇష్టమట. మోహన్ బాబు విలన్ గా నటించిన సినిమాలు చూసే.. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు సునీల్.
త్రివిక్రమ్, నేను ఒకే రూమ్ లో ఉండేవాళ్లం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందు నుంచే సునీల్ కు త్రివిక్రమ్ తెలుసు. త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు లెక్చరర్ గా పనిచేసేవారట. లెక్చరర్ గా పనిచేస్తూనే సినిమాల్లో ట్రై చేసేవారట. హైదరాబాద్ కు వచ్చాక.. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండి.. సినిమాల్లో ట్రై చేశారట. త్రివిక్రమ్ కూడా తన సినిమాల్లో సునీల్ కు ఎక్కువగా కమెడియన్ రోల్స్ ఇవ్వడంతో.. మిగితా సినిమాల్లో కూడా సునీల్ కు కమెడియన్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. అలా.. విలన్ అవుదామనుకున్న సునీల్ కాస్త.. కమెడియన్ అయ్యాడు.
చిన్నప్పుడు మా అమ్మ పర్సులో డబ్బులు ఎక్కువగా కొట్టేసేవాడిని

సునీల్ తండ్రి తన చిన్నప్పుడే చనిపోయారు. దీంతో.. సునీల్ ను పెంచే బాధ్యత మొత్తం సునీల్ తల్లి మీద పడింది. తను చాలా కష్టపడి మరీ.. సునీల్ ను పెంచింది. చిన్నప్పుడు సినిమాలు చూడటం కోసం.. తన పర్సులో డబ్బులు కొట్టేసి మరీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పటి నుంచి సినిమాల మీద సునీల్ కు క్రేజ్ ఏర్పడింది.
రామ్ గోపాల్ వర్మ తో సినిమా చేయాలన్నా డ్రీమ్ తోనే అప్పల్రాజు సినిమా చేశా

సునీల్ కు.. రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టమట. అందుకే.. ఆయనతో తన జీవితంలో ఒక్కసినిమా చేయాలన్న కోరిక ఉండేదట సునీల్ కు. అందుకే.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో నటించారట సునీల్. రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పటికీ సునీల్ కు చాలా ఇష్టమట.

సునీల్ గురించి మనకు తెలియని ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే.. సునీల్ కు చాలా సిగ్గు ఎక్కువట. అందుకే అమ్మాయిలతో ఎక్కువగ మాట్లాడడట. ఎవ్వరితోనూ ఎక్కువగా విభేదాలు పెట్టుకోరు. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండే వ్యక్తి సునీల్.































