రమ్యకృష్ణ.. తెలుగు సినిమా పరిశ్రమలో అందంతో పాటు అభినయంతో అద్భుతంగా ఆకట్టుకున్న నటీమణి. గ్లామర్ పాత్రల్లోనైనా, కుటుంబ నేపథ్య పాత్రల్లోనైనా ఇట్టే ఒదిగిపోయి నటించే అందాల తార. తెలుగులో అందరు టాప్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. బాహుబలి సినిమాతో తన తన నటనా సత్తాను దేశ వ్యాప్తంగా చాటి చెప్పింది. శివగామి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ తార. రమ్యకృష్ణ తొలి రోజుల్లో టెలీప్లేలలో యాక్ట్ చేసింది.

అలా సినిమా రంగంలోకి వచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామరస్ రోల్స్ చేసి యువతను ఆకట్టుకుంది. తన కెరీర్ ను ఓ రేంజిలో టర్న్ తిప్పిన సినిమా రజనీకాంత్ హీరోగా చేసిన నరసింహ. ఈ చిత్రంలో నీలాంబరి అనే నెగెటివ్ రోల్ చేసి ఓ రేంజిలో నటించింది. ఆమె క్యారెక్టర్ ను జనాలు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పుకోవచ్చు. వయసు మీద పడటంతో హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందింది రమ్య.

అందాల తార రమ్యకృష్ణ 1983లోనే నటిగా సినిమా రంగంలోకి వచ్చింది. ఆమె సినిమాల్లోకి రాకముందే డ్యాన్సర్ గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో ప్రదేశాల్లో డ్యాన్స్ షోలు చేసింది. అంతేకాదు.. టీవీ నాటకాల్లో కూడా నటించింది. మూడు రంగాల్లో ఆమె అద్భుతంగా రాణించింది. నాట్యం అంటే రమ్యకు ఎంతో ఇష్టం. చిన్న సత్యం అనే మాస్టారు దగ్గర కూచిపూడి నాట్యంలో మెళకలవలు నేర్చుకుంది. ధనుంజయ దగ్గర భరతనాట్యంలో ఓనమాలు దిద్దింది. ఆ తర్వాత డ్యాన్సర్ గా మంచి గుర్తింపు పొందింది. అనంతరం తెలుగులో భలే మిత్రులు సినిమాతో ట్రీ ఇచ్చింది. ఆనంద్ బాబుతో కలిసి నటించింది. ఈ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత సంకీర్తన అనే సినిమాలో నాగార్జునతో నటించింది. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. అనంతరం అక్షింతలు అనే సినిమా చేసింది. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక రమ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఓ వైపు సినిమాలు చేస్తూనే పలు టీవీ నాటకాలు చేసింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమారంగాల్లో అద్భుతంగా రాణించింది రమ్య. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో ఉంటుంది. సినిమా దర్శకుడు కృష్ణవంశీని 2003లో పెళ్లి చేసుకుంది. వీరికి రిత్విక్ వంశీ అనే అబ్బాయి ఉన్నాడు. ఆమెకు ఓ సోదరి ఉంది. తన పేరు వినయ. ఆమె టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి.































