సినీ క్రిటిక్ , నటుడు కత్తి మహేష్ ఈనెల 26న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఐసీయూ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యం పై ఇప్పటివరకు ప్రజలకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు మొదలయ్యాయి.

ఈ క్రమంలో కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, దీనితో ఆయన ప్రస్తుతం ఇసోలేషన్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం మాత్రం లేదని.. కానీ తర్వాత మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాటిని ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నా కూడా అయన శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తో పాటు అయన డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే ఆ సమయంలో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అతనికి చిన్న గాయం కూడా తగలకుండా బయటపడ్డాడు. అయితే కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఇప్పటికే కత్తి మహేష్‌కు పలు సర్జరీలు పూర్తి చేసారు. మరికొన్ని సర్జరీలు కూడా జరగాల్సి ఉన్నాయి. ఇక కత్తి మహేష్‌కు ప్రాణాపాయం తప్పినా ఆయనలో ఒక లోపం మాత్రం జీవితాంతం ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయినట్టు ఆయన మేనమామ శ్రీరాములు మీడియాకు వెల్లడించారు. ఇక చూపు వచ్చే ఆస్కారం లేదని వైద్యులు చెప్పినట్టు అయన తెలిపారు. అయితే ప్రమాదంలో అయన ముక్కులో పలు ఎముకలు చిట్లాయని అందువల్ల ఆయనకు బోన్ రీ కన్స్ట్రక్షన్ జరుగుతోందని తెలిపారు. ఈ క్రమంలో కత్తి మహేష్ మామూలు మనిషి కావడానికి మాత్రం చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.































