ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి. సజ్జనార్, పెట్రోల్ బంక్ వద్ద యువకులు చేసిన ప్రమాదకర విన్యాసాల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్రంగా స్పందించారు. “వినాశకాలే విపరీత బుద్ధి” అన్న వ్యాఖ్యతో యువత నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో, పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కొందరు యువకులు బైక్‌పై వీలింగ్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడున్న వారిని, ముఖ్యంగా అమ్మాయిలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం చివరకు ప్రమాదానికి దారితీసింది. స్టంట్ చేస్తుండగా నియంత్రణ కోల్పోయిన బైక్ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, ఒకరు యువకుడిపై దాడికి కూడా దిగినట్లు సమాచారం.
ఈ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్ సిటీ పోలీస్ దృష్టికి వచ్చింది. స్పందించిన సజ్జనార్, ఇలాంటి చర్యలు కేవలం చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాలకు ముప్పు తెస్తాయని హెచ్చరించారు. పెట్రోల్ బంక్ వంటి సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి స్టంట్లు చేయడం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు.
యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, క్షణిక ఆకర్షణ కోసం చేసే ఇలాంటి చర్యలు కుటుంబాలకు బాధను మిగుల్చవచ్చని గుర్తు చేశారు. “వీలింగ్స్ వల్ల మీ తల్లిదండ్రులకు ‘ఫీలింగ్స్’గా కన్నీళ్లు మిగలకూడదు” అంటూ భావోద్వేగంగా సూచించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, రోడ్డు భద్రతను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.































