Kerala Crime : కేరళలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రేష్మా అనే 30 ఏళ్ల మహిళ ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మోసాల వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం రండి.

అసలేం జరిగిందంటే?
రేష్మా అనే ఈ నిత్య పెళ్లికూతురు ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించేది. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ సైట్‌లలో యువకులను వెతికి, వారిని తన మాటలతో బుట్టలో వేసుకునేది. అందరికీ ఒకే రకమైన కట్టుకథలు చెప్పేది. తాను దత్తత తీసుకున్న బిడ్డనని, తన పెంపుడు తల్లి తన పెళ్లిని వ్యతిరేకిస్తోందని, చిత్రహింసలకు గురి చేస్తోందని నమ్మించేది.
ఆమె చెప్పే బాధాకరమైన కథలకు ఎంతోమంది యువకులు కరిగిపోయేవారు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడేవారు. పెళ్లి ఖర్చులన్నీ వారే భరించేవారు. పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి జారుకునేది. ఇలా చాలా మందిని మోసం చేసింది.
రేష్మా మోసాల చిట్టా..
రేష్మా మొదటి పెళ్లి 2014లో ఎర్నాకులానికి చెందిన వ్యక్తితో జరిగింది. 2017 వరకు అతనితో కాపురం చేసింది.
ఆ తర్వాత ఆమె తన మోసాలకు తెరలేపింది. 2022 నాటికి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.
తిరువనంతపురం, అంగమాలి, తొడుపుళ, వాలకం ప్రాంతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంది.
కొల్లంకు చెందిన వ్యక్తితో ఎక్కువ కాలం కలిసి ఉంది. అతనికి ఒక బిడ్డను కూడా కన్నది. అయితే అత్తమామలకు అనుమానం రావడంతో అక్కడి నుంచి కూడా పారిపోయింది.
గుట్టు ఎలా రట్టయిందంటే..
చివరిగా తిరువనంతపురం శివారు ప్రాంతానికి చెందిన ఒక పంచాయతీ సభ్యుడితో రేష్మా పెళ్లికి సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా ఆమె మోసం బయటపడింది. పంచాయతీ సభ్యుడి స్నేహితుడి భార్య రేష్మాను గుర్తుపట్టి అసలు విషయం చెప్పేసింది. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా గతంలో పెళ్లి చేసుకున్న డాక్యుమెంట్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
త్వరలో రేష్మా మరో ఇద్దరు యువకులను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇంతలోనే ఆమె మోసాలు బయటపడటంతో కటకటాల పాలైంది.





























