తన కుమార్తె పుట్టిన రోజున ఓ మాజీ జర్నలిస్టు గ్రాండ్ గా చేద్దామని అనుకుంది. అనుకున్నట్లుగానే వాళ్ల ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్ లో టేబుల్ ను బుక్ చేశారు. అయితే పుట్టిన రోజు రానే వచ్చింది. లోపలికి వెళ్లేందుకు అందరినీ అనుమతించిన రెస్టారెంట్ సిబ్బంది.. ఆమెను మాత్రం అనుమతించలేదు. ఎందుకో తెలుసా.. ఆమె చీరకట్టుకున్నందుకు.

అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఖేల్ గావ్ లో మాజీ జర్నలిస్టు అనితా చౌదరి వారి కుటుంబసభ్యులు కలిసి ఉంటున్నారు. ఓ రోజు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఖేల్ గావ్ లోనే ఆక్విలా అనే రెస్టారెంట్ లో ఓ టేబుల్ ను బుక్ చేశారు. ఆ రెస్టారెంట్ లోకి అందరిని అనుమతించిన రెస్టారెంట్ సిబ్బంది అనితాను మాత్రం అనుమతించలేదు.
ఆమె చీర కట్టుకొని ఉందని.. రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని చెప్పారు. దీంతో ఆమె వారికి ఇది కూడా క్యాజువల్స్ యేగా అంటూ చెప్పుకొచ్చారు అనితా మరియు ఆమె కూతురు. అయినా వాళ్లు వినిపించుకోలేదు. వాళ్ల మేనేజర్ కూడా సిబ్బందికే సపోర్టు పలికారు. దీంతో వాళ్లు పుట్టిన రోజు వేడుకను చేసుకోకుండానే ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఈ మొత్తం వివాదాన్ని వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్విలా రెస్టారెంటుపై మండిపడుతున్నారు. నటి రిచా చద్దా కూడా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.