అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్న ఘటనలు ఇటీవల కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. బావపై ప్రేమతో భర్తకు విషం ఇచ్చి చంపేసిందో భార్య. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చి భర్త ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎస్సై చందర్ వెల్లడించిన వివరాల ప్రకారం… వర్ధన్నపేట తండాకు చెందిన బాలాజీ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య కాంతి, కుమార్తె స్వప్న, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు.
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి…
ఈ నెల 8వ తేదీ సాయంత్రం బాలాజీ మద్యం తాగడానికి బయటకు వెళ్తుండగా, అతని భార్య కాంతి పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను అతనికి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పి వస్తోందంటూ కిందపడిపోయాడు. భర్త అస్వస్థతకు గురైనప్పటికీ, కాంతి అతడిని అక్కడే వదిలేసి దగ్గర్లోని తాళ్లకుంట తండాలో ఉంటున్న తన అక్క, బావ ఇంటికి వెళ్లింది.
వైద్యం విఫలం, మృతి
కొంతసేపటికి పొరుగింటివారు బాలాజీని గుర్తించి వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలాజీ ఆరోగ్యం మరింత విషమించడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూలై 15న బాలాజీ మృతి చెందాడు.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
మృతుడి తండ్రి హరిచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు బాలాజీని అతని భార్య కాంతి, బావతో ఉన్న అక్రమ సంబంధం కారణంగానే చంపిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని ఎస్సై చందర్ తెలిపారు.






























