ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా హింసించారు తండావాసులు. అంతే కాకుండా ఒక గంట పాటు కర్రలతో కొట్టుకుంటూ ఊరంతా ఊరేగించారు. ఈ అమానూష ఘటన సూర్యాపేట జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట మండలం రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యారు.

ఈ హత్య కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇటీవల ఆమె బెయిల్ పై విడుదలై తన సోదరి ఇంట్లో తలదాచుకుంటోంది. తండాలో తన బంధువు చనిపోతే.. అంత్యక్రియల నిమిత్తం వెళ్లింది. శంకర్ నాయక్ చనిపోయిన తర్వాత ఆమె వాళ్లకు మొదటి సారి కనిపించింది.
హత్యకు గురైన బంధువులు ఆమెను చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చి.. వివస్త్రను చేసి.. కంట్లో కారం చల్లి చిత్ర హింసలకు గురిచేశారు. అంతేకాకుండా ఆమెను కర్రలతో కొట్టుకుంటూ గ్రామంలో ఊరేగించారు. ఈ తతంగం మొత్తం ఒక గంట పాటు జరిగింది. చుట్టు పక్కల వాళ్లు చూస్తున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు.
దీంతో ఆమె అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని ఎంపీటీసీ ఇంట్లోకి వెళ్లింది. అక్కడ ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఆమెకు దుస్తులను ఇచ్చి.. ఓ గదిలో రక్షణ కల్పించింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.





























