ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ ఖలీల్ గాయపడాడు. తన ఓవర్ మధ్యలోనే నొప్పితో బాధపడుతూ మైదానం వీడాల్సి వచ్చింది. మొదట చిన్న సమస్యగా భావించినా, పరీక్షల్లో కుడి తొడ కండరాల్లో తీవ్ర గాయం ఉన్నట్లు తేలింది. ఈ గాయం కారణంగా అతడు సీజన్ మొత్తానికి దూరమవ్వాల్సి వచ్చింది.
ఖలీల్ గాయం సీఎస్‌కేకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే జట్టు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా అందుబాటులో లేడు. అలాగే విదేశీ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా వెన్నునొప్పితో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఖలీల్ ఔట్ కావడం బౌలింగ్ విభాగాన్ని మరింత బలహీనపరిచింది.
జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఖలీల్ స్థానంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ముఖేశ్ చౌదరి, రామకృష్ణ ఘోష్ వంటి బౌలర్లు జట్టులో అవకాశాలు పొందే అవకాశముంది.
ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు ఐదు మ్యాచ్‌లలో రెండు విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ సీఎస్‌కేకు కీలకంగా మారింది. వరుస గాయాల మధ్య జట్టు ఎలా పుంజుకుంటుందో చూడాల్సి ఉంది.































