ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్య, వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపట్టారు.

 

అమ్మఒడి పథకం అమలు ద్వారా పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం 20,000 రూపాయలు చెల్లిస్తోంది. ఈ పథకాలతో పాటు జగన్ సర్కార్ విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని జగన్ సర్కార్ మొదట అనుకున్న ప్రకారం ఈరోజే అమలు చేయాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల పథకం అమలు వాయిదా పడింది.

సీఎం జగన్ ఈ నెల 8వ తేదీన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 42.34 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం ఈ పథకం కోసం 650 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కిట్లను అందించనుంది.

ఈ కిట్ లో స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, జత బూట్లు, జత సాక్సులు, 3 జతల యూనిఫారాలు ఉంటాయి. జగన్ సర్కార్ ఈ పథకం ద్వారా పిల్లలు బడిబాట పట్టేలా చేయాలని.. బడి బయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. జగన్ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రజల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్ఫ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here