బతుకమ్మ పండగ వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పాటలను కంపోజ్ చేసి.. య్యూట్యూబ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందులో వీ6 లో వచ్చే బతుకమ్మ పాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీనిలో వచ్చిన పాటలు అంతకముందు బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. అదొక్కటే కాదు తెలుగు మీడియా ఛానల్లు అన్నీ ఇలా చేసినవే.

ఎవరి ఇష్టాలకు వాళ్లు పాటలను విడుదల చేస్తూ పండగపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ సారి మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. అదేంటంటే.. మన మ్యూజిక్ డైరెక్టర్లలో చెప్పుకోదగిన.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఏ.ఆర్ రెహమాన్. అతడు ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా. అతడి సంగీతంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ పాటను రూపొందించారు. త్వరలోనే బతుకమ్మ పాటను విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతున్నది.
ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉన్నదని, దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ పాటను తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాయగా ప్రముఖ గాయకుడు ఉన్నిక్రిష్ణన్ పాడారు.
ఈ పాటను గత నెల 29, 30 తేదీల్లో తెలంగాణలోని యాదాద్రీ భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో షూట్ చేసినట్టు సమాచారం. మొత్తం పాటను నాలుగు నిమిషాల నిడివిగల వీడియోతో రూపొందించారు. ఈ బతుకమ్మ పాటను బతుకమ్మ పండగ రోజైన అక్టోబర్ 5న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారట.



























