అమ్మవారికి బంగారంతో చేసిన మాస్క్.. ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే!

0
249

కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా నగర పరిధిలోని బాగుయాటీ ప్రాంతంలో కాళికామాత దేవి ఆలయంలో దుర్గామాత ఉత్సవాలు ప్రతీ సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెబుతోంది.

ఈ ప్రస్తుత తరుణంలో అమ్మవారికి బంగారంతో మాస్క్ తయారు చేశారు. కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలనే సందేశాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా ఈ సారి దుర్గామాతకు 20 గ్రాముల బంగారంతో తయారు చేసిన మాస్క్ తయారు చేయించారు. అంతేకాకుండా ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేస్తూ చేతిలో సిరంజి,ఆక్సీమీటర్, ఇతర వైద్య సామాగ్రి, శానిటైజర్ లు పెట్టారు.

ఇలా భక్తులకు కరోనా నిబంధనల గురించి తెలియజేస్తూ.. వాటిని పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. బంగారం మాస్కుతో తయారు చేసిన దుర్గామాత విగ్రహాన్ని బంధుమహల్ క్లబ్ లో టీఎంసీ ఎమ్మెల్యే, బెంగాల్ గాయని అదితి మున్షీ ఆవిష్కరించారు. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో డాక్టర్లు చెప్పే నియమాలు పాటించాలనే సంకేతంగా మాస్క్‌ను ఉంచామని మున్షీ చెప్పారు.

గత సంవత్సరంలో కరోనా కారణంగా దుర్గామాత ఉత్సవాలను నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సారి అలా కాకుండా పూజా మండళ్లకు వచ్చే భక్తులకు కరోనా జాగ్రత్తలు తెలియజెప్పేందుకే అమ్మవారికి కూడా బంగారంతో చేసిన మాస్కు పెట్టామని నిర్వాహకులు వివరించారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు.