మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్‌లో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 284 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే గతేడాది(2020–21) ఇదే త్రైమాసికంలో ఏజీఆర్ బకాయిల కోసం భారీ మొత్తంలో కేటాయింపులు చేయడంతో సంస్థ రూ.15,993 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రస్తుతం వచ్చిన తొలి క్వార్టర్ లో వచ్చిన ఆదాయంలో ఒక అనుబంధ సంస్థకు చెందిన టెలికం టవర్ల విక్రయం ద్వారా లభించిన రూ. 30.5 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15.3 శాతం పెరిగి రూ.26,854 కోట్లకు చేరింది. మూడు నెలల కాలానికి చూస్తే 4.2శాతం పెరిగింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 146కు మెరుగుపడింది. ఇదే మాదిరిగా గతంలో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ. 138గా నమోదైంది. మార్చి త్రైమాసిక లాభం రూ.759.2 కోట్లతో పోలిస్తే 62 శాతం తగ్గుముఖం పట్టింది. మార్చి త్రైమాసికంలో ఇది రూ.145గా నమోదైంది.
ఇక డేటా ప్రకారం చూస్తూ ఒక్కో వినియోగదారుడు నెలకు దాదాపు 18.5 జీబీల డేటాను వినియోగించాడు. అంతేకా కాకుండా 1044 వాయిస్ కాల్స్ చేసినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 48.9 శాతం నుంచి 49.1 శాతానికి బలపడ్డాయి. క్యూ1లో భారతీ ఎయిర్‌టెల్ దేశీ టర్నోవర్ 19 శాతం ఎగసి రూ. 18,828 కోట్లుగా నమోదైంది.
మొబైల్ ఆదాయం 4జీ వినియోగదార్లు అధికంగా జత కావడంతో దాదాపు 22 శాతం పుంజుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 4 జీ కస్టమర్లు 51 లక్షల మంది జత కలిసినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తం గా కస్టమర్ల సంఖ్య దాదాపు 47.4 కోట్లకు చేరినట్లు తెలియజేసింది.






























