Harish Rao : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊహించని విధంగా పెద్ద ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో హరీష్ రావు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఆయన గెలుపు చెల్లదని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి గెలిచిన హరీష్ రావుపై అనర్హత వేటు వేయాలని చక్రధర్ గౌడ్ తన పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కాంగ్రెస్ నేత ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తేల్చింది. దీంతో హరీష్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ తీర్పుపై హరీష్ రావు స్పందిస్తూ.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై కేసులు వేస్తోందని, కోర్టు వారికి బుద్ధి చెప్పిందని ఆయన అన్నారు. ఫోన్ టాపింగ్ కేసు అయినా, ఇప్పుడు ఈ ఎన్నికల కేసు అయినా.. అన్నీ దురుద్దేశపూర్వకంగానే పెట్టారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు సూచించారు. ప్రజల తరఫున అధికార పార్టీని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.






























