సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీఫ్ ఫండ్) అనేది పేదలకు ఎంతో కొంత భరోసాను కల్పిస్తుంది. ఆర్థికంగా కొంత ఆసరాగా నిలుస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో జాయిన్ తర్వాత.. అక్కడ అయిన ఖర్చులో కొంత మేర సీఎంఆర్ఎఫ్ నుంచి డబ్బులను ప్రభుత్వం అందజేస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధుల గోల్ మాల్ భారీగా జరిగినట్లుగా ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. పేదలు, లబ్ధి దారుల నుంచి డేటా తీసుకుని.. వారి పేరుతో CM రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారు కొందరు కేటుగాళ్లు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది కుమ్మక్కయి గూడుపుఠాణీ నడిపిట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.అందులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ ప్రకటించింది. 2014 నుండి సీఎంఆర్ఎఫ్ స్కాం విచారణను చేపడుతున్నట్లు ఏసీబీ తెలిసింది.
అరెస్టైన నలుగురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులున్నారని ఏసీబీ ప్రకటించింది. 2014 నుంచి కూడా దీనిలో అక్రమాలు జరుగుతున్నట్లు సమచారం రావడంతో.. వాటిపై ఏపీ సీఎం విచారణ చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీఆర్‌పీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకొందని అనుమానించిన ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరు మాసాలుగా విచారణ చేస్తున్నారు.
దొరికిన వారిలో ఏ వన్ గా చలువాడి సుబ్రమణ్యం ఉండగా.. ఏ టూ గా సోక రమేష్ ఉన్నారు. ఏ త్రీగా చదలవాడ మురళీకృష్ణ ఉండగా.. చివరిగా ఏ ఫోర్ గా కొండెపూడి జగదీష్ ధన్‌రాజ్ ఉన్నారు. వీరి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీటిలో ఎంత అమౌంట్ స్కాం జరిగిందనే విషయాలను ఏసీబీ వెల్లడించలేదు. వీరి నలుగురితో పాటు దీనిలో ఎవరికైనా భాగస్వామ్యం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.































