పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రజలు గత మూడు రోజులుగా వింత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఏలూరులో ఈ వింతవ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం టెన్షన్ పెడుతోంది. నిన్నటివరకు ఆస్పతులలో వింత వ్యాధి లక్షణాలతో 464 మంది చేరగా వీరిలో ఒకరు మరణించారు. కొందరు రోగులను అధికారులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు తరలించారు.

అయితే రాష్ట్రంలోని ల్యాబుల్లో చేసిన పరీక్షల్లో ఇప్పటివరకు వింత వ్యాధికి గల కారణాలు తెలియలేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి అసలు కారణం తెలిసిపోయిందని.. డిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో రోగుల రక్తం సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే నికెల్, సీసం మెటల్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నివేదిక అందిందని తెలిపారు.
ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు వింత వ్యాధి బారిన పడిన ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో పాలు, నీళ్ల శాంపిల్స్ కావాలని కోరినట్లు సమాచారం. న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపించడానికి సీసం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు, పాల ద్వారా శరీరంలోకి ఈ లోహం ప్రవేశించి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రజల శరీరంలోకి మెటల్స్ ఏ విధంగా వెళ్లాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు రోజురోజుకు వింత వ్యాధి కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికెళ్లిన వారిలోను మూర్చ లక్షణాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం. ప్రజలు మాత్రం నీటి కాలుష్యం వల్లే ఈ విధంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.































