కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కు సంబంధించి అనేక సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలా..? వద్దా..? అని ఆలోచిస్తున్నారు.

అయితే గర్భిణులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు, వైద్యుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు గర్భిణులపై క్లినికల్ ట్రయల్స్ చేయలేదు. అమెరికాలో గర్భిణులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలో వద్దో వాళ్లు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే బ్రిటన్ లో మాత్రం గర్భిణులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని ఆదేశాలు ఉన్నాయి. అయితే నిపుణులు మాత్రం గర్భిణులు కరోనా వ్యాక్సిన్ కు దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించలేదు కాబట్టి గర్భిణులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే కొన్ని సందర్భాల్లో తల్లికి, బిడ్డకు ప్రమాదం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ క్లినికల్ డేటా వచ్చిన తరువాతే కరోనా వ్యాక్సిన్ ను గర్భిణులకు ఇవ్వాలో వద్దో అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలు ప్రస్తుతానికి వ్యాక్సిన్ కు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.




























